koodali

Friday, September 5, 2025

ఏం మనుషులో...?

 


మేము వినాయక నిమజ్జనం కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉందంటే..ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ఆకులు, పువ్వులు ఉన్నాయి. చెత్త కూడా పడేసి ఉంది.  దుర్వాసన వస్తోంది.
 
 ఇక ఆ నీటిలో నిమజ్జనం చేయలేక ఇంటికి వచ్చి చిన్న బకెట్లో నీళ్ళు పోసి ఆ నీటిలో నిమజ్జనం చేసి నీటిని చెట్ల వద్ద పోసాను. ఎవరికైనా దగ్గరలో మంచి నీరు  చెరువు ఉంటే అక్కడ కూడా కలపవచ్చు.  
 
ఊరేగింపు సమయంలో కొందరు పులిహోరను పంచిపెడుతూ వెళ్తారు. ఎందుకో కొన్ని పులిహోర పాకెట్లను అలా పక్కనే వదిలి పెట్టేసినట్లుంది.
 
ఆ నీటిని మొక్కల వద్ద పోస్తే మనం అక్కడ మట్టిలో నడుస్తాము కదా..అని సందేహాలు రావచ్చు..చెరువు నీటిలో నిమజ్జనం చేసినా చెరువునీటిలో నిలబడతారు, చెరువు నీటిని పనులకు వాడుకుంటారు, చెరువు నీటిని  స్నానానికి కూడా ఉపయోగిస్తారు  కదా..అనిపించింది. మరీ ఎక్కువ ఆలోచిస్తే అయోమయం అవుతుంది. కొంతవరకే ఆలోచించగలం.
 
 ..............
 పాతకాలంలో వినాయక చవితి సందర్భంగా  కొందరు తమ పిల్లలను మొక్కలు, చెట్ల వద్దకు తీసుకువెళ్ళి పత్రిని సేకరించేవారు. ఆ విధంగా ఎంతో విలువైన 21 రకాల పత్రి గురించి పిల్లలకు తెలిసేది. పూజ తరువాత ఆ పత్రిని చెరువులలో కలపటం వల్ల ఆ ఆకులలోని మెడిసినల్ గుణాలు నీటిలో కలిసేవి.


పాతకాలంలో సంక్రాంతికి భోగి రోజున ఇంట్లోని పాత చెక్క సామాను విరిగినవి, పాడైనవి ఉంటే భోగిమంటలో వేసేవారు. ఆ విధంగా ఇల్లు శుభ్రం అయ్యేది. ఈ రోజుల్లో కొందరు భోగిమంటలో రబ్బరు టైర్లను కూడా వేస్తున్నారు. ఇందువల్ల పొల్యూషన్ పెరుగుతుంది.

టెక్నాలజి పేరుతో ప్లాస్టిక్ ..వంటివాటి వల్ల పొల్యూషన్ పెరుగుతుంటే.. వాటిని విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ పడేస్తూ మరింత పొల్యూషన్ పెంచుతున్నారు.
.............

సోషల్ మీడియా వల్ల  విపరీతధోరణి మరింత పెరిగింది. మీడియాలో ఉండాలంటే ఎప్పుడూ ఏదో ఒక్కటి చెప్పాలని కొందరు ఎప్పుడూ ఏదో చెబుతూ ఉన్నారు.

 మన దేశంలో చాలా మందికి అత్యాశ పెరిగింది. ఎంతసేపూ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే పిచ్చి పెరిగింది. తల్లితండ్రి పిల్లలను చంపటం, భార్యాభర్తల అక్రమసంబంధాలు..ఒకరినొకరు క్రూరంగా చంపుకోవటాలు ఎక్కువయ్యాయి. 


మీడియా ద్వారా అశ్లీలమైన, భయంకరమైన వ్రాతలు, దృశ్యాలు ప్రసారాల ప్రభావం చాలా ఉంటుంది. మూఢనమ్మకాలను ప్రచారం చేసేవాళ్లు కూడా ఎక్కువయ్యారు. ఇలాంటి వాటిని ఎందుకు బాన్ చెయ్యటం లేదో అర్ధం కావటం లేదు.


 అశ్లీలత, భయానకమైన విషయాలు, మూఢనమ్మకాలు..ఇలాంటివి మీడియాలో రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ప్రచారం చేసే వాళ్లపైన కేసులు పెట్టి శిక్షించాలి.

మన దేశంలో చాలామంది  శుభ్రతను పాటించటం లేదు. అశుభ్రంగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేసే వారిపైన కూడా కేసులు పెట్టి శిక్షించాలి.

ఈ రోజుల్లో చాలా విషయాల్లో వేలం వెర్రిలా ఏది ఎందుకు చేస్తున్నారో తెలియకుండా తయారవుతోంది.

ఎలాగోలా డబ్బు సంపాదించటం..విపరీతంగా ఆస్తులు పోగేయటం..విపరీతంగా వస్తువులను కొనేయటం..రకారకాలు వండుకుని విపరీతంగా తినటం...చేస్తున్నారు. మా డబ్బుతో మేం కొనుక్కుంటాం.. అనటానికి వీల్లేదు. 


విపరీతమైన వస్తు వినియోగం వల్ల పర్యావరణం పాడవుతుంది. అమూల్యమైన ఖనిజ సంపద తరిగిపోతుంది. ఈ ప్రపంచం ఏ కొద్దిమందికి సంబంధించినది కాదు. అన్ని జీవులకు సంబంధించినది.
...............

ఏమైనా మనకు అర్ధం కాకుంటే,  
మన కష్టసుఖాల గురించి కొందరు మనుషులతో చెప్పుకోవటం కంటే, దైవానికే చెప్పుకోవటం మంచిది. 
 
సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సాటి మనుషుల తో కూడా మంచిగా ఉండాలి.  కష్టసుఖాలలో సాటి మనుషుల  సహాయసహకారాలు కూడా అవసరమే కానీ, మనుషులు కొంతవరకే చేయగలరు. దైవము సర్వశక్తివంతులు. వారు తలచుకుంటే ఏమైనా చేయగలరు. మానవప్రయత్నం సరిగ్గా చేస్తుంటే, దానికి తగ్గ ఫలితాన్ని దైవమే అందిస్తారు. 


పండుగలు, పూజలు కూడా కొందరు తమకు తోచినట్లు చెబుతుంటే, చేసేవాళ్లు తమకు తోచినట్లు చేస్తున్నారు. ఆచారవ్యవహారాల పేరుతో ప్రజలను భయపెట్టటం కూడా ఎక్కువయ్యింది.

ఈ రోజుల్లో ఎవరికి ఏమీ చెప్పేటట్లు లేదు. దైవమే అందరిని సరైన దారిలోకి తీసుకురావాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
......................

ఇక్కడ వ్రాసిన కొన్ని  విషయాలు ఇంతకుముందు పోస్టులలో వ్రాసినవే. 
 
ఈ పోస్టును కొంతకాలం తరువాత ఇక్కడ తొలగించే ఆలోచన ఉంది. కాబట్టి, ఎవరైనా వ్యాఖ్యలను వ్రాస్తే వాటిని కూడా డిలిట్ చేస్తాను కాబట్టి దయచేసి అపార్ధం చేసుకోవద్దండి.

konni vishayaalu...

 
ప్రాచీనకాలంలో  ఒక పద్దతిగా సమాజంలో పని విభజన జరిగింది. ఎవరి పనిని వారు చక్కగా చేస్తే స
మాజం సజావుగా ఉంటుంది. . రైతులు ఉదయాన్నే పొలానికి వెళ్తారు. సైనికులు ఎంతో అప్రమత్తంగా దేశరక్షణలో అప్రమత్తంగా ఉంటారు.

సమాజంలో ఎన్నో వృత్తులవారున్నారు. ఎవరి పని వారు చక్కగా చేస్తే అదికూడా పూజయే.

ఇవన్నీ తెలిసిన ప్రాచీనులు, కొన్ని వృత్తులవారు పెద్దేత్తున పూజలు చేయనక్కరలేదు, వారు తమ స్వధర్మాన్ని చక్కగా పాటిస్తే చాలు, కొద్దిపాటి పూజలు చేసినా బోలెడు పూజలు చేసినంత పుణ్యం వస్తుందని ప్రాచీనులు తెలియజేసారు.

అయితే, ప్రాచీనులు చెప్పినదానికి వ్యతిరేకంగా ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే,  అన్ని వృత్తులవారు కూడా పెద్ద ఎత్తున పూజలు చేయవచ్చని, అందరూ చాలా ఆచారవ్యవహారాలను పాటించాలని  చెబుతున్నారు.

  మేమెందుకు పెద్ద ఎత్తున పూజలు చేయకూడదంటూ కొందరు మాట్లాడుతారు. ఇప్పుడు చాలామంది ఇతర ప్రాంతాల వారి నుండి నేర్చుకుని కూడా అనేకపూజలను చేస్తున్నారు. ఇవ్వాళ ఫలానా పూజ కాబట్టి, ఈ నియమాలను పాటించాలి, లేదంటే కష్టాలు వచ్చి పడిపోతాయంటూ చెప్పేవాళ్లు కూడా ఎక్కువయ్యారు.

కొత్తకొత్త ఆచారవ్యవహారాలను చెబుతున్నారు కొందరు.  నిత్యమూ చాలా విషయాలను పాటించాలంటే అందరూ పాటించలేరు. వీటి గురించి కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ ఆ గొడవలు తగ్గాలంటే ఏమి పరిహారాలు చేయాలో? 

 కొందరు చెప్పేవి వింటే హిందువుల ముసుగులో హిందువులకు విసుగు కలిగేలా చెబుతున్నారేమో? అని సందేహాలు కూడా కలుగుతున్నాయి.

ప్రతి విషయానికి ఎన్నో కొత్తకొత్త విధివిధానాలను చెబుతుంటే అవన్నీ గుర్తు ఉంచుకుని పాటించాలంటే చాలా కష్టం. వాటిని పాటించడానికే ధ్యాస ఉంటే, ఇక దైవము పట్ల ధ్యాస ఎలా?


ఉదా..ఎవరికైనా తాంబూలం ఇవ్వాలంటే అరటిపండ్ల తొడిమలు ఏ దిక్కున ఉండేటట్లు ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు..ఇలా వందల నియమాలు చెబుతారు. ఇవన్నీ గుర్తు ఉంచుకుని తప్పుల్లేకుండా పాటించాలంటే ధ్యాస అంతా విధివిధానాల పట్లే ఉంటుంది కానీ,  దైవము పట్ల ధ్యాస 
ఎలా?

 ఆచారవ్యవహారాల్లో ఎన్నో మంచివిషయాలను పొందుపరిచి ప్రాచీనులు మనకు అందించారు. అయితే, కాలక్రమేణా ఎన్నో మూఢనమ్మకాలు వచ్చాయి. అందువల్ల విచక్షణతో ప్రవర్తించాలి.

............
 ఈ కాలంలో పండుగలు, ఫంక్షన్లు సందర్భంగా అనేక కొత్త ఆచారవ్యవహారాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా చాలా ఖర్చులు, శ్రమ కూడా ఉంటోంది. అనవసర సామాను ఎక్కువవుతోంది.
 
 ఇచ్చే గిఫ్టులతో ఇల్లంతా గజిబిజిగా తయారవున్నాయి. గిఫ్ట్ వద్దంటే వినరు. ఈ కార్యక్రమాల ద్వారా కొందరు వస్తువులను అమ్ముకుంటూ  వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. అన్ని వృత్తులవారు పాల్గొనటం వల్ల చాలామంది వ్యాపారస్తులకు ఆదాయం పెరిగింది.

కొంతకాలం క్రిందట కొన్ని వస్తువులు కొని సాటి స్త్రీలకు పంచిపెట్టాలని  లేకపోతే అరిష్టమని ప్రచారం చేసారు.  కొందరు వర్తకులు తమ వ్యాపారం కొరకు అలా  ప్రచారం చేసారని కొందరు అన్నారు. 

ఈ రోజుల్లో కొందరు మతాల పేరుతో కూడా ధనార్జన..వ్యాపారం చేయటం ఎక్కువయ్యింది. జీవనవిధానంలోనే మతము, ఆర్ధికాభివృద్ధి కలగలిపి ఉండవచ్చు కానీ,   వ్యాపారమే ముఖ్యంగా మారకూడదు.

 అవసరమైనంత వరకు ఆర్ధికాభివృద్ధి అవసరమే కానీ, ఆర్ధికాభివృద్ధే జీవిత ధ్యేయం కాదుకదా.. ఈ రోజుల్లో చాలామంది  ఎలాగైనా సరే బోలెడు డబ్బు సంపాదించటమే  జీవితధ్యేయంగా బతుకుతున్నారు.

కొందరు మతం పేరుతో సంస్థలను మెలకొల్పి ప్రజల వద్ద డబ్బు తీసుకుని మోసం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పాతకాలంలో దేవాలయాల నిర్వహణకొరకు రాజ్యాలను ఏలే రాజులు ధనాన్ని సమకూర్చేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. 

 ఈ రోజుల్లో అంటరానితనం వంటివి లేకుండా అన్ని వృత్తుల వారు  దేవాలయాలకు వెళ్తున్నారు. 
 ...................


ప్రజలు హుండీలలో వేసే ధనాన్ని.. బంగారాన్ని పెద్ద ఎత్తున నిల్వ ఉంచితే ఎవరైనా దోపిడీదారుల దృష్టి పడవచ్చు. హిందువులలో కూడా కొందరు చేతివాటం ఉండే వాళ్ళుండే అవకాశం ఉంది.

అలా పెద్ద ఎత్తున బంగారాన్ని  ప్రోగుచేసి ఉంచటం కన్నా, కొంత నిల్వ ఉంచి, మిగతా ధనాన్ని హిందుపేదప్రజల కొరకు ఉపయోగించవచ్చు. అంటే, ప్రజలకు కొందరికి ఉచితంగా లేక కొందరికి తక్కువ ధరకు విద్యను, వైద్యాన్ని అందించవచ్చు.
  హిందువులలోనే చాలామంది పేదలున్నారు.

  హిందూదేవాలయాల సొమ్మును ఇతరమతస్తులకు ఇచ్చే హక్కు ఎవరికి ఉండదు. అలాగని దేవాలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించటమూ మంచిది కాదనిపిస్తుంది.  

కొందరు ఏమంటారంటే, దేవాలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించి ప్రేవేట్ వారికి అప్పగించాలంటారు. ప్రభుత్వం వద్ద ఉంటే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే కనీసం ఓటు ద్వారా ఆ ప్రభుత్వాలను దింపే అవకాశమైనా సామాన్యప్రజలకు ఉంటుంది. ప్రైవేట్ వారి చేతుల్లోకి దేవాలయాలు వెళితే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే సామాన్యప్రజలు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే పరిస్థితి కూడా ఉండవచ్చు. ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్ధం కావటం లేదు.

 *****************
ఈ రోజుల్లో కొన్ని చోట్ల శుభ్రత లేని ప్రదేశాలలో కూడా కొత్తకొత్త దేవాలయాలను కడుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, జనాలలో భక్తి నిజంగా ఉంటే సమాజంలో ఇన్ని నేరాలు, ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయో? అర్ధం కావటం లేదు. కోరికలు తీరటానికి పూజలు చేయటం కూడా ఎక్కువయ్యింది.
.................

మన గ్రంధాలలో కొన్ని విషయాలను గమనిస్తే.. ఇలా ఎందుకు రాసారో? అనిపిస్తుంది. అవి ప్రక్షిప్తాలు కావచ్చు అనుకుంటున్నాము.

తరతరాలనుంచి అంటరానితనం మరియు కొన్ని మూఢనమ్మకాల వల్ల  ఇప్పటికే హిందుసమాజం ఎంతో నష్టపోయింది. 

పాతకాలంలో జరిగిన అంటరానితనం.. వంటి కొన్ని పాపాల వల్ల కాబోలు భారతదేశంలో విదేశీయుల పాలన రావటం, విదేశీమతాలు ప్రవేశం జరిగి ఉండవచ్చు. ప్రతివిషయానికి  కర్మ ప్రభావం ఉంటుంది కదా..

 ఇప్పటికైనా హిందువులు ఒకరినొకరు గొడవలు పడకుండా సామరస్యంగా ఉంటే బాగుంటుంది. సమాజంలో అన్ని వృత్తుల వారు అవసరమే. ఎవరి కష్టసుఖాలు వారికి ఉన్నాయి. అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ చక్కగా మంచిగా జీవించాలి.
..................

జీవితంలో కొన్ని నియమాలు ఉంటే ఎవరికైనా ఆచరించడానికి సులభంగా ఉంటుంది. అదేపనిగా నియమాలంటూ అంతులేకుండా చెప్పుకుంటూ ఉంటే అందరూ పాటించలేరు. మతాన్నే వదిలేయాలనిపించవచ్చు. 

 ఎందరో హిందువులు మతం కూడా మారారు. అందువల్ల సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి.

దైవము యొక్క అవసరం అందరికి ఉంటుంది. అయితే, దైవారాధనకు కఠినమైన మార్గాలను వదిలి సులభమైన మార్గాలను ఎన్నుకోవాలనిపించవచ్చు.

 పండుగలు వస్తున్నాయంటే టెన్షన్ వస్తుంది. బోలెడు నియమాలను పాటించలేక మతము అనేది లేకుండా నాకు కుదిరినంతలో దైవాన్ని ఆరాధించుకోవాలనిపిస్తుంది. ఇదంతా గమనించిన తరువాత,ఇప్పుడు నాకు వీలైనంతలో మాత్రమే పాటించటానికి ప్రయత్నిస్తున్నాను.

 ఇది కలికాలం. కలికాలంలో మనుషులు శారీరికంగా, మానసికంగా కొంత బలహీనులుగా ఉంటారు కాబట్టి, దైవభక్తి కలిగి దైవస్మరణ చేస్తే చాలు తరిస్తారని ప్రాచీనులే తెలియజేసారు.

బోలెడు పూజలను చేయకపోయినా.. జీవితంలో దైవభక్తి కలిగి, కొన్ని పూజలను చేస్తూ, నీతినిజాయితీలతో జీవించటానికి ప్రయత్నిస్తే దైవకృపను పొందే అవకాశం ఉంటుంది.

.............
ఇక్కడ వ్రాసిన చాలా విషయాలు ఇంతకుముందు పోస్టులలో వ్రాసినవే.

  ఈ పోస్టును కొంతకాలం తరువాత ఇక్కడ తొలగించే ఆలోచన ఉంది. కాబట్టి, ఎవరైనా వ్యాఖ్యలను వ్రాస్తే అవి కూడా డిలిట్ చేస్తే దయచేసి అపార్ధం చేసుకోవద్దండి.

 


Monday, June 23, 2025

కొన్ని పోస్టుల లింక్స్..

 

కొన్ని పోస్టుల లింక్స్..

ఆసక్తి ఉన్నవారు క్రింద ఉన్న లింక్స్ వద్ద చదవగలరు.
 

 వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1   *******

  వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2   **********

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3    *************

 వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4   *************



ఒక సంఘటన..

 

 ఒకప్పుడు మేము ముంబాయిలో ఉన్నప్పుడు 13 వ అంతస్తులో ఉండేవాళ్లం.ఆ ఇంటికి అద్దాలతో ఉన్న బాల్కనీలు చక్కగా ఉన్నాయి. వెళ్ళిన కొత్తలో బాల్కనీ నుంచి అన్నీ భలే కనిపిస్తున్నాయని బాల్కనీలో కూర్చోవటం జరిగింది.

 

 ఒకరోజు  ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్లినప్పుడు నేను బాల్కనీలో కూర్చున్నాను. కొంతసేపటి తరువాత ఇంట్లోకి వెళ్దామని చూస్తే ఎంత ప్రయత్నించినా గ్లాస్ డోర్ రావటం లేదు. పొరపాటున గ్లాస్ డోర్ స్పీడుగా వేస్తే అది లాక్ అయినట్లుంది. 

 

అలాంటి గ్లాస్ డోర్లు మాకు కొత్త. అలా లాక్ అవుతాయని నాకు తెలియదు. చాలా భయం వేసింది. నా దగ్గర ఫోన్ కూడా లేదు. 13 అంతస్తుల పైనుంచి పిలిచినా క్రింద ఎవరికి వినపడలేదు. 

 

 క్రింద  రెండు దేవాలయాలు కనిపిస్తున్నాయి. దూరంగా సముద్రం నుండి ఒక పాయ లాంటిది కనిపిస్తుంది. దైవాన్ని ప్రార్దించుకున్నాను.

(నవి ముంబై   ప్రాంతం)

 ఆ ఇంటికి వెళ్ళిన కొత్తలో ఈ సంఘటన జరిగింది. మా బాల్కనీకి ఆనుకుని పక్కింటివారి బాల్కని ఉంది. పక్కింటివారు నాకు పరిచయం లేదు.  పిలిచాను కానీ వాళ్ళు పలకలేదు. 

 ఆ బాల్కనీలో చిన్న అలమార ఉంది. అందులో ఒక పాత ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంది. ఆ బాటిల్ తో పక్కింటివారి బాల్కనీ వైపు గట్టిగా కొట్టాను. ఆమె లోపల ఉన్నట్లున్నారు. వారికి వినిపించలేదు. 

మా వాళ్లు బయట నుంచి తిరిగి వచ్చే వరకు నేను బాల్కనీలో అలా ఉండలేను అనిపించింది. నాకు టాయ్లెట్ కూడా వెళ్ళాలనిపించింది. 

 దైవాన్ని ప్రార్ధించుకున్నాను. నేను మళ్లీ కొన్నిసార్లు  పక్కవారి బాల్కనీకి బాటిల్తో కొట్టి సౌండ్ చేసాను.

 కొంతసేపటికి పక్కింటి ఆమె, వారి బాల్కనీకి వచ్చారు. ఆమె నన్ను చూసి బయటకు వెళ్లి, ఇంకొక ఆమెను తీసుకొచ్చి ఇద్దరూ మా ఇంటి తలుపును బయటనుంచి తీసి నన్ను కాపాడారు. మా ఇంటి ఓనర్ మా ఇంటి ఇంకో తాళాన్ని వాళ్ల వద్ద ఉంచారట.

 నాకు పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. దైవము దయ వల్ల అలా రక్షించబడ్దాను.

 ఆ సమయానికి  పక్కింటి వాళ్ళు వారి ఇంట్లో లేకపోతే నాకు చాలా కష్టమయ్యేది. 

  చిన్నపిల్లలు  ఎవరైనా అలా ఇరుక్కుపోతే కష్టం కదా.. అందుకే జాగ్రత్తగా ఉండాలని ఇవన్నీ వ్రాసాను. 

అక్కడ వాటర్ బోటిల్ ఉండటం, దానితో పక్కవాళ్లను పిలవాలని ఆలోచన రావటం, పక్కవాళ్ళు ఆ సౌండ్ విని రక్షించటం.. ఇవన్నీ భగవంతుని దయ వల్లనే జరిగాయి.

అంతా దైవము దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు.

............. 

Reply
anrdDecember 7, 2023 at 5:07 PM

ఎత్తైన అపార్ట్మెంట్స్లో కొందరు బాల్కనీల్లో అద్దాలు డోర్లు అమరుస్తారు. అవి లోపల నుండి బోల్ట్ ఉంటాయి. బాల్కనీకి వెళ్లి తటాలున డోర్ వేస్తే క్లోస్ అయ్యి మనుషులు బాల్కనీలోనే ఉంటారు. ఇంట్లో ఎవరైనా ఉంటే ఫరవాలేదు. లేకపోతే బాల్కనీ నుంచి అరచి బైటవారిని పిలిచి, ఇంటి తలుపు ఎలాగోలా తెరిచి లోపలికి వెళ్లి బాల్కనీ అద్దాలతలుపు తెరవాలి.

ఇక 12వ అంతస్తు లో బాల్కనీలో చిక్కుకున్నవారు ఎంత అరిచినా క్రింద ఉన్నవారికి వినపడదు. పక్కన పోర్షన్లో వినిపించేటట్లు ఎవరైనా ఉండాలి. చేతిలో ఫోన్ ఉండాలి. ఫోన్ చార్జిన్గ్ ఉండాలి. బాల్కనీల్లో ఫోన్ అమర్చుకుంటే వాచ్మెన్ ను పిలవచ్చు. 

 లేకపోతే ఒక గట్టితాడుకు చిన్న బకెట్ కట్టి అన్ని బాల్కనీల్లో ఉంచుకోవాలి. ఎవరైనా ఇరుక్కుపోతే బకెట్ క్రిందకు వెయ్యచ్చు. బాల్కనీలో ఒకచిన్న అల్మారా కట్టి, అందులో చిన్నబుక్, పెన్ పెట్టుకుంటే బాల్కనీలో ఇరుక్కుపోయిన విషయం పేపర్లో వ్రాసి, బకెట్లో వేసి క్రిందకు వదలవచ్చు. క్రింద తిరిగేవారు చూసి కాపాడతారు.

  .................................

  anrdDecember 7, 2023 at 5:07 PM

కొన్ని అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ బయటవారు కనిపించేటట్లు ఉంటుంది. అయితే, కొన్నిచోట్ల పూర్తిగా క్లోస్ చేసిన తలుపులతో ఉండే లిఫ్ట్ ఉంటుంది. ఇలాంటి లిఫ్ట్ ఏ కారణం చేతనైనా కొద్దిసేపు ఆగిపోతే అందులో వారు భయపడతారు. చిన్నపిల్లలయితే ఇంకా భయపడతారు. 

 ఇలాంటి లిఫ్ట్ల్లో ఒక తలుపుకు పైనుంచి క్రిందకు కొద్దిగా ఖాళీ ఉండేటట్లు, అంటే పొడుగుగా ఉండే కిటికీలాగ చేసి దానికి మెష్ అమర్చి తయారుచేస్తే ఎప్పుడయినా ఆగిపోతే అందులో ఉన్నవారికి గాలి ఆడుతుంది, బయటకు కనిపిస్తుంది.చిన్నపిల్లలకు కూడా బయట కనిపించేలా ఉండాలి. అయితే చేతి వేళ్ళు పట్టకుండా సన్నటి మెష్ అమర్చాలి. లిఫ్టులో వాచ్ మెన్ కు తెలిసేలా ఫోన్ కూడా పెట్టవచ్చు.

చాలా అపార్ట్ మెంట్స్ లో ఇళ్లలో పనిచేసేవారిని, కూరలు అమ్మేవారిని లిఫ్ట్ వాడనివ్వరు. అన్ని మెట్లు ఎక్కాలంటే ఎవరికైనా కష్టమే. ఆ వర్కర్స్ వచ్చి పనిచేయకపోతే చాలామందికి కుదరదు. అందువల్ల వర్కర్స్ నూ లిఫ్ట్ వాడనివ్వాలి. అలా కుదరదు అంటే, కనీసం పైకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఉపయోగించి, క్రిందకు దిగేటప్పుడు మెట్లను వాడవచ్చు.

 ************** 

నాకు వచ్చిన మరికొన్ని ఆలోచనలు.......

మరికొన్ని విషయాలు..

 సమాజంలో, గొడవలు..నేరాలు..ఘోరాలు ఎక్కువయ్యాయి. సమాజంలో కొందరు మనుషులు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు.  

ఇప్పడు ప్రపంచంలో మనుషులు ఎన్నో పాపాలు చేస్తున్నారు. 

మతం పేరుతో కూడా కొందరు హింస చేయటం, మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయి. 

కొన్ని విషయాలను, సంఘటనలను గమనిస్తే, ఏది ఎందుకు జరుగుతుందో అర్ధం కావటం లేదు.

 ప్రపంచంలో జరుగుతున్న ఉపద్రవాలు, ప్రకృతి విపత్తులు తగ్గాలంటే, మనుషులు  పాపాలు చేయటం.. సాటిజీవులను హింసించటం వంటివి మానాలి.

అంతా మంచిగా ఉండాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. దైవమే దిక్కు.

 ..........

 దైవము జీవులకు అవసరమైనవి ఎన్నో ఇస్తున్నారు. జీవులకు అవసరమైన..గాలి, నీరు, ఆహారానికి ఎన్నో మొక్కలు..ఇలా ఎన్నో ఉన్నాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు కూడా ఉన్నాయి. 

దైవ సృష్టిలో ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి. ఉదా.. ఆహారం దానికి అదే అరగటం, శ్వాస తీసుకోవటం ఎలా ఎన్నో ఉన్నాయి.
దైవానికి అనేక కృతజ్ఞతలు. 
 

మనుషులు కొందరు తమ స్వార్ధం, అత్యాశ..వంటి గుణాలతో ప్రపంచంలో బాధలకు కారణమవుతున్నారు. మనుషులు మంచిగా ప్రవర్తిస్తే బాగుంటుంది.

********************

మన గతజన్మలలో ఉన్నవాటి గురించి ఇప్పుడు కూడా తెలిస్తే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది కొన్నిసార్లు.  గతజన్మలలో మనకు తెలిసినవి ఏమైనా ఇప్పుడు కూడా ఉంటే బాగుండనిపిస్తుంది.

 

 గతజన్మలలో మనతో ఉన్న వారు ఇప్పుడు మనతో ఉండవచ్చు..లేకపోవచ్చు. ఇప్పుడు ఉన్నా కూడా మనము వారిని గుర్తించలేకపోవచ్చు. అయితే, దైవము ఎప్పుడూ ఉంటారు..సూర్యుడు, చంద్రుడు, భూమి..గతజన్మలలో కూడా మనతో ఉన్నారు. 


గత జన్మలలో మనతో ఉన్న అప్పటి సూర్యుడు, చంద్రుడు, భూమి..ఇప్పుడు కూడా ఉన్నారు. మనము వాటిని గుర్తించగలము. ఇది ఎంతో ఆశ్చర్యకరము, ఆనందకరమైన విషయము. 

దైవము జీవులకు జన్మజన్మల బంధువు, శాశ్వతమైన వారు.

........................

 ఒకే పోస్టులో రకరకాల విషయాలను వ్రాసేసాను. ఏమీ అనుకోవద్దండి.

Saturday, March 22, 2025

కనీస అవసరాలు తీరాలి....

 

ఈ పోస్ట్ లోని విషయములు జనవరిలో వేసిన.. కొన్ని విషయములు ..పోస్టులోని విషయములే. ఆ పోస్ట్ పెద్దగా అవటం వల్ల, కొంతభాగాన్ని తీసి ఇక్కడ వేయటం జరిగిందండి.

....................

టెక్నాలజి అంటూ పోటీలు పడుతున్నారు కొందరు. టెక్నాలజీ కొంతవరకు అవసరమే కానీ, పర్యావరణహిత టెక్నాలజి ఉండాలి. .

 ప్రపంచంలో నైతికవిలువలకు హాని కలగని విధమైన టెక్నాలజి వాడకం కావాలి. ఉదా..సెల్ఫోన్ల ద్వారా అశ్లీలచిత్రాలు వంటివి మంచిదికాదు.

 ............

   ప్రపంచంలో మనుషులందరికీ ...ఆహారం, ఇల్లు, విద్య, వైద్యం, రక్షణ....ఇలాంటి కనీస అవసరాలు తీరాలి. 

 ...........

ఒక్క మొక్క నుండి అనేక విత్తనాలు ..ఆ విత్తనాల నుండి అనేక మొక్కలు..ఆ మొక్కల నుండి బోలెడు ఆహారం లభించేలా దైవం సృష్టిని చేసారు. ..

అయినా కూడా,   అందరికీ ఆహారం లభించేలా చేసుకోలేకపోతున్నారు. 

ఇప్పటికీ ప్రపంచంలో చాలామందికి సరిగ్గా ఆహారం లభించటం లేదు.

 కొందరేమో తినటానికి తిండిలేక, డబ్బులేక, ఉపాధిలేక కష్టపడుతున్నారు. 

చాలామంది మద్యం, మత్తుమందులకు బానిసలవుతున్నారు.  

డబ్బు ఉన్నా కూడా కొందరికి అనేక సమస్యలు ఉంటున్నాయి,  చాలామందికి మానసిక ప్రశాంతత ఉండటం లేదు.
 
 

ధనిక దేశాలలో కూడా చాలామంది అనేక సమస్యలతో బాధలు పడుతున్నారు.

 ప్రపంచంలో ప్రశాంతత లేనప్పుడు  ఏం లాభం?  

 సమాజంలో నేరాలు..ఘోరాలు జరగకుండా ఉండాలి. అందరూ ప్రశాంతంగా బ్రతకాలి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి. 

.................

 అంతా దైవము దయ.
 .....................

 


Friday, January 31, 2025

కొన్ని విషయములు..


ఈ పోస్ట్ పెద్దగా అవటం వల్ల, ఈ పోస్ట్ లోని కొంత భాగాన్ని మార్చ్ నెలలో పోస్ట్ చేయటం జరిగిందండి.
...........

ఈ రోజుల్లో, బ్రతుకుతెరువు కొరకు ఉద్యోగం అని కాకుండా, ఉద్యోగం కొరకు బ్రతకటం అన్నట్లు ఉంది వ్యవహారం.
 
ఈ మధ్య కొందరు పెద్ద కంపెనీల వాళ్ళు ఏమంటున్నారంటే, ఉద్యోగస్తులు మరిన్ని ఎక్కువ గంటలు పనిచేయాలని చెబుతున్నారు. త్వరగా ఇంటికెళ్ళటం వేస్ట్ అన్నట్లు, భార్యాభర్తలు ఎక్కువగా మాట్లాడుకోకూడదన్నట్లు కూడా కొందరు చెబుతారు.

 ఉద్యోగస్తులతో బాగా పనిచేయిస్తూ వేలకోట్లు సంపాదించే కంపెనీల వాళ్ళు ఇలా మాట్లాడటం అన్యాయం..

కొన్ని సంవత్సరాల క్రిందట పనిగంటలు పెరిగినదానికి వ్యతిరేకంగా విదేశాలలో కార్మికులు పోరాటం చేసారు. ఆ పోరాటాలకు గుర్తుగా మేడే జరుపుతారు.
 
 ఈ రోజుల్లో కంపెనీలు కొందరు ఉద్యోగస్తులను పని లో నుండి తీసివేస్తున్నారు..అది చూసి భయపడి, మిగతావాళ్ళు విపరీతంగా పనిచేస్తుంటారు.
...............

మనుషులు  డబ్బు కొరకు  పనిచేయటం కొరకే పుట్టలేదు. పనిచేసి డబ్బు సంపాదించటం జీవితంలో ఒక భాగం. మనుషులు దైవధ్యానం చేసుకోవాలి. గృహస్థాశ్రమంలో కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి.కుటుంబం అంటే ఎన్నో బాధ్యతలుంటాయి. సంతానాన్ని చక్కటి పౌరులుగా తయారుచేయటంలో తమ వంతు పాత్రను సరిగ్గా నిర్వహించాలి.

 
ఎవరైనా తాము ఆరోగ్యంగా ఉండటానికి కొంత సమయం కేటాయించుకోవాలి. చక్కటి చెట్లు, మొక్కలు పెంచుతూ ఆహ్లాదంగా ఉండవచ్చు. ప్రపంచంలో ఉన్న ప్రకృతిసుందరదృశ్యాలను చూసి ఆనందించవచ్చు. పర్యావరణాన్ని కాపాడటంలో కొంత సమయం కేటాయిస్తే మంచిది.

 
సమాజంలో కష్టాలలో ఉండేవారికి కొంత సేవ లేక సాయం చేయవచ్చు. ఇలా ఎన్నో ఉండగా, సమయం చాలక ఎందరో ఉరుకులు పరుగులతో జీవిస్తున్నారు. కొన్ని ఉద్యోగాల వారికి ఇంటికొచ్చినా, ఆఫీసువాళ్ళు ఫోన్లు చేసి పనులు చేయించుకుంటున్నారు.

 .....................
అనేకకారణాల వల్ల, కుటుంబసభ్యుల మధ్య కొన్ని గొడవలు వస్తుంటాయి.  
పనివత్తిడి వల్ల  కూడా కుటుంబాలలో గొడవలు జరిగి, వివాహబంధాలు విచ్చిన్నమవుతున్నాయి. ఈ రోజుల్లో చాలామంది  విచ్చలవిడి ప్రవర్తనకు ఇష్టపడుతున్నారు.
.....................

ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు సమయం చాలక ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్నారు. ఈ మధ్యన యువత కొందరు  పని ఒత్తిడితో ఉన్నపళాన చనిపోయారు. కొందరు ఉద్యోగస్తులు ఆహారం వండుకోవటానికి సమయం చాలక,బయట  ఆహారాన్ని తిని అనారోగ్యం పాలవుతున్నారు.

  ఈ రోజుల్లో ప్రజలకు ఉదయం, సాయంకాలం ఎండ తగలకపోవటం, శరీరానికి వ్యాయామం లేకపోవటం, సరైన ఆరోగ్యకరమైన ఆహారం లభించకపోవటం, వాతావరణకాలుష్యం..వంటి సమస్యలతో పాటు......
 
 ఎక్కువమంది ఎప్పుడూ సెల్ఫోన్లు, కంప్యూటర్లు వాడటం వల్ల రేడియేషన్ మరియు సెల్ఫోన్లను వేళ్లతో అదేపనిగా నొక్కటం వల్ల నరాల వ్యాధులు, మెడనొప్పి, కంటిసమస్యలు, తల దిమ్ము..వంటి సమస్యలు వస్తున్నాయి.
 
 కొంతకాలం క్రిందట ఐటీ రంగంలో పనిచేసేవారికి మెడనొప్పులు, భుజాల నొప్పులు..వంటివి ఎక్కువగా ఉండేవి. సెల్ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాక, ఇప్పుడు చాలామందికి ఈ జబ్బులు వస్తున్నాయి.
 
 పిల్లలు కూడా ఆన్లైన్  ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇవన్నీ సరిదిద్దుకోకుంటే ఎవరూ ఏం చేయలేరు.

 
ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ప్రపంచంలోని ప్రతి విషయాన్ని నేర్చుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది.  ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసుకోవాలనుకోవటం కూడా వ్యసనమే. ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకుంటే చాలు అనిపిస్తుంది.
  ..........
 

చాలామంది సంతానాన్ని పెంచే సమయం, ఓపిక లేదంటూ డేకేర్లలో వేస్తున్నారు. ఇంటివద్ద అల్లారుముద్దుగా పెరగవలసిన చంటిపిల్లలు బయట ఎక్కడో పెరుగుతున్నారు. కొందరు తల్లితండ్రి ఏమంటారంటే, పిల్లల కోసమే డబ్బు సంపాదిస్తున్నామని చెబుతుంటారు.

  మాటలు కూడా సరిగ్గారాని, వాళ్ళ బాధలు చెప్పలేని చిన్నవయస్సులో పిల్లల్ని బయట డేకేర్లలో వేసి, వాళ్ళకొరకు డబ్బు సంపాదిస్తున్నామని చెప్పటమేమిటో?
 
కొందరు పేరెంట్స్  పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటం లేదని  కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. అది చాలా పాపం.  

 చంటి పిల్లలను పెంచడానికి చాలా ఓపిక అవసరం. తల్లితండ్రి కూడా ఓపికతో వ్యవహరించాలి. 

 

కొన్ని డేకేర్ సెంటర్ల వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారట. పిల్లలు అక్కడ తోటిపిల్లలతో ఆడుకుంటారు. అయితే, ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో..అర్ధం కావటంలేదు. పైకి అందరూ బాగానే మాట్లాడతారు. తల్లి దగ్గరుండి చంటిపిల్లలను ప్రేమగా చూసుకుంటే మంచిది.
 
చిన్నపిల్లల విషయాలలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
 .................
 
 కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగులకు పనివత్తిడి తగ్గటం కొరకు అంటూ..ఆఫీసులోనే రకరకాల ఆహారం, వినోదం..వంటివి ఏర్పాటుచేస్తున్నారు.  ఇక, కొందరు ఉద్యోగులు ఇంటికంటే ఆఫీసులోనే బాగుందని ఆఫీసులోనే ఎక్కువసేపు పనిచేస్తుంటారు.

 ఈ రోజుల్లో పెంచుకున్న పనివత్తిడితో ఎవరికీ సరైన విశ్రాంతి ఉండటం లేదు.

అలాగని అందరూ పనులు మానేసి సోమరిగా ఉండకూడదు. అతిగా పనిచేసి అలసిపోకూడదు కాని, ఎవరి పనులు వారు చక్కగా నిర్వహించాలి.
.............................

  ఎన్నో రంగాలలో పనిచేసేవారు  చాలా టెన్షన్ తో పనిచేసే పరిస్థితి ఉంది.

......................

యంత్రాలు లేని పాతకాలంలో ఒక వస్తువు తయారుచెయ్యాలంటే
కొన్నిరోజులు పట్టేది, చేయడానికి కొన్ని రోజులు పని ఉండేది.
 
ఇప్పుడు యంత్రాల సాయంతో అదేపనిని గంటలో చేస్తున్నారు.ఇందువల్ల నిరుద్యోగం పెరుగుతుంది. అదేపనిగా వస్తువుల తయారీ వల్ల ప్రపంచంలో ఉన్న సహజవనరులూ త్వరగా ఖర్చవుతాయి.

ఉపాధి..ఉద్యోగాల కొరకు అదేపనిగా పనిచేసి, అదేపనిగా వస్తువులను ఉత్పత్తి చేస్తూ పోతే, పర్యావరణం పాడయ్యి ప్రపంచానికి పెనుప్రమాదం వచ్చే పరిస్థితులు రావచ్చు.
 
 మనం వాడుతున్న కంప్యూటర్లు, ఏసీలు, ఫ్రిజ్లు..వంటి వాటివల్లకూడా ఓజోన్ పొర పల్చనయ్యే ప్రమాదముందని ఒక దగ్గర చదివాను. అప్పుడు ఓజోన్ పొర పల్చనయ్యి అతినీలలోహిత కిరణాలు భూమిపై వ్యాపించి కొత్త విపత్తులు రావచ్చు.

 అందువల్ల అతిని తగ్గించుకుంటే మంచిది.
  

Friday, January 17, 2025

కుంభమేళా లో...

 ..

కొందరు ఏమంటున్నారంటే, మహాకుంభమేళా లో అనేకమంది స్నానాలు చేయటం.. వంటివాటి వల్ల పొల్యూషన్ జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. 


 వర్షాలు పడినప్పుడు భూమిపైన ఉన్న సుగంధాలు, దుర్గంధాలు,  మంచివి, చెడువి...కూడా..అనేకమైనవి ..వాననీటితో పాటు నదుల్లోనూ, కాలువల్లోనూ కలుస్తాయి..

 

మనుషులు బయట పడేసే వ్యర్ధాలు, చెత్తా, చెదారం,  పశుపక్ష్యాదుల మలమూత్ర విసర్జనలు, వాటి మృతకళేబరాలు.. వంటివి కూడా వాననీటితో పాటు నదుల్లోనూ, కాలువల్లోనూ కలుస్తాయి...

 

 మాంసాహారం కొరకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలు, లక్షలుగా పశుపక్ష్యాదులను చంపి, మిగిలిన టన్నుల  వ్యర్ధాలను బైటపడేస్తారు.

 

ప్రపంచవ్యాప్తంగా సముద్రం.. బీచ్ ల వద్ద అనేకమంది స్నానాలు చేస్తారు. ...స్విమ్మింగ్ పూల్స్ లో చాలామంది ఈతకొడుతుంటారు. ...స్విమ్మింగ్ పూల్స్   నీటిలో బ్లీచింగ్ పౌడెర్.. వంటివి కలుపుతారు.

 

అయితే, నదుల్లో నీరు ఒకదగ్గర నుంచి ఇంకో దగ్గరకు దూరప్రాంతాలనుంచి పారుతూ చక్కగా ప్రవహిస్తుంది కాబట్టి,  బ్లీచింగ్ పౌడర్ ..వంటివి వేయరు. 


అందువల్ల,  ఎన్నో సంవత్సరాల కొకసారి నదిలో పుష్కర స్నానం చేయటం వల్ల సమస్యలు ఏమీ ఉండవు.....అయితే, నదీ స్నానాలలో సబ్బులు, షాంపూలు, ప్లాస్టిక్ కవర్లు..వంటివి వాడకూడదు.


కుంభమేళాకు వెళ్తే రోగాలొస్తాయని కొందరు అంటున్నారు..కొన్నాళ్ళక్రితం కరోనాతో ప్రపంచం అల్లాడిపోయింది. మరి కరోనా రోగం ఎందుకొచ్చినట్లు?

*********

 ఆధునిక కాలంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి.   పారిశ్రామిక వ్యర్ధాలను, విషపదార్ధాలను,  నగరాలనుంచి వచ్చే డ్రైనేజ్ ను ...నదులలోకి, సముద్రంలోకి వదిలేస్తుంటారు..వాటివల్ల కలిగే నష్టాలు  చాలా ఉన్నాయి.

 

ఆధునిక పోకడలతో పర్యావరణం పాడయ్యింది. రసాయనాల పంటలు వాడి అనారోగ్యాలు వస్తున్నాయి. అనేక విష రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భనీరు పాడవుతోంది.

 

 మనం వాడుతున్న కంప్యూటర్లు, ఏసీలు, ఫ్రిజ్లు..వంటి వాటివల్ల కూడా ఓజోన్ పొర పల్చనయ్యే ప్రమాదముందని ఒక దగ్గర చదివాను....గాలిలో కలిసే విషవాయువుల వల్ల కూడా  ఓజోన్ పొర రంధ్రాలు పడుతోందంటున్నారు. 

 

అప్పుడు ఓజోన్ పొర పల్చనయ్యి , అతినీలలోహిత కిరణాలు భూమిపై వ్యాపించి కొత్త విపత్తులు రావచ్చు.

 

 గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల విపరీతమైన వాతావరణ మార్పులు జరుగుతున్నాయి.

ఇలా చాలా జరుగుతున్నాయి. వీటి గురించి ఆలోచించితే మంచిది.